AP Budget: ₹3.22 లక్షల కోట్లతో ఏపీ 2025-26 బడ్జెట్ 1 y ago
AP : ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టకు రూ.6,705 కోట్లు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖకు రూ.1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు కేటాయించామని పయ్యావుల పేర్కొన్నారు.
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్పసంఖ్యా వర్గాల కోసం రూ.5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు కేటాయించామన్నారు.
గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు రూ.8,785 కోట్లు, యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు, మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు కేటాయించామని చెప్పారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు, ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు, దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు, ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించామని తెలిపారు.